వినరో భాగ్యం విష్ణుకథ

వినరో భాగ్యం విష్ణుకథ                             




                   (మే9వ తేదీ అన్నమయ్య జయంతి సందర్భంగా....)' 
'చందమామరావో ..జాబిల్లిరావో' అని ప్రతి తల్లి తన బిడ్డలకు అన్నం పెట్టేటప్పుడు మారాం చేస్తే పాడుతూ చందమామను చూపిస్తుంది. ఎందరో తల్లులు తమ బిడ్డలకు బువ్వ తినిపించేటప్పుడు పాడే పాట ఇది. ఈ పాట వ్రాసింది పదకవితాపితామహుడు, తొలివాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. బిడ్డను నిద్రపుచ్చేటప్పుడు తల్లిపాడే లాలిపాట 'జో అచ్యుతానంద జోజో ముకుందా', ముద్దుగారే యశోద కొడుకు'వంటి పాటలు వ్రాసింది అన్నమయ్యే. ఇప్పటికి 500 ఏళ్లుగా గోవిందుని సన్నిధిలో కీర్తించే కీర్తనలు అన్నమయ్య నోటినుంచి జాలువారినవే. 'నారాయణా నమో నమో భవ నారద సన్నుత నమోనమో', కొండల్లో నెలకొన్న కోనేరు రాయుడు', తిరుమల కొండ', వినరో భాగ్యం విష్ణుకథ' వంటి ఆణిముత్యాలు అన్నమాచార్యుడు వ్రాసినవే.తెలుగుసంస్కృతిలోభాగమైన గొబ్బిళ్లు, తుమ్మెద, శృంగార, అధ్యాత్మిక కీర్తనలు అన్నమయ్య జాతికి ఇచ్చిన మణులు.జానపదుల నోట్లో అవి ఎల్లప్పుడూ నిలిచిఉంటాయి. ఆయన వేంకటేశునిపై అల్లిన శృంగార కీర్తనలు మనసుకు హాయినిస్తాయి.ఆయన వ్రాసిన 32వేల కీర్తనలలో కేవలం 12వేలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వాటిని ఆయన వారసులు తామ్రరేకులపై చెక్కారు. ప్రస్తుతం అవి తిరుమల శ్రీవారిభాండాగారంలో భద్రంగాఉంచారు.అన్నమయ్య కీర్తనలను సాధారణ వాక్యాల్లోగేయాలుగా కూర్చారు.పదకవితాశైలికి, దక్షిణాదిభజన సంప్రదాయానికి ఆయన ఆద్యుడు.ఆయన తర్వాత వచ్చిన సంకీర్తనాకారులు త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసులకు అన్నమయ్య మార్గదర్శకుడు. తిరుమలలో ఆళ్వార్ ప్రబంధాలు అధ్యయనం చేసినా బ్రహ్మజ్ఞానం సాధించలేకపోయాననే బాధపడేవారు. భక్తుడైనఅన్నమయ్యకు గోవిందుడుకలలో కనిపించి గురుముఖతా విద్యాజ్ఞానం పొందమని సూచనలతో అహోబిలం ఆదివన్ శఠగోప ముని శిష్యరికం చేశారు. దాంతో ఆయనకు ఆత్మజ్ఞానం సిద్ధించింది.వెంకటరమణుడితోపాటు నృసింహస్వామి భక్తుడు కూడా అన్నమయ్య. ఆయనపై అనేక కీర్తనలుపాడారు.ఆయన అనేక విష్ణుఆలయాలనుసందర్శించి వారిపైకీర్తనలురచించారు.ఆంజనేయుణ్ణి, రామానుజాచార్యులనూకీర్తించాడు. భగవద్గీతను సులువైన పదాలతోమనోహరంగా మలచి గానంచేసారు.ఆయన నోటివెంట శృంగారం బంగారంలా పండింది.సంగీతసాహిత్యసమ్మేళితమే ఆయన కీర్తనలు.95సంవత్సరాలునిండు జీవితం గడిపిన అన్నమయ్య తన చివరి క్షణం వరకూ పరంధాముని కీర్తించారు. ఉగ్గుపాలతో ఉదాత్తభావాలు వంట పట్టించుకున్న అన్నమయ్య హరిపాదానికి తనపదానికి ముడిపెట్టాడు. ఆయన తన గేయాల్లోతెలుగు, సంస్కృతపదాలనుసమానంగావాడారు.సంకీర్తలక్షణమనేసంస్కృతగ్రంథం, మంజరిద్విపదలోశృంగారమంజరి, ద్విపదరామాయణం, వెంకటాచలమహత్యం రచించారు.కాని వీటిలో చాలా లభ్యం కావటం లేదు. . అన్నమయ్య 1408 మే 9వతేదీ కడపజిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో (సర్వధార సంవత్సరంలో)జన్మించాడు. ఆ ఇంటి పురోహితుడు ఘన విష్ణువు అన్నమాచార్య అని నామకరణం చేసారు.ఏకసంథా గ్రాహి అయిన అన్నమయ్య ఇంటివద్దే విద్యను అభ్యసించారు. 16వ ఏట మొట్ట మొదట తిరుమల శ్రీనివాసుని దర్శించారు.ఆయన కీర్తనలతో స్వామిని సేవించడం ద్వారా పూజారుల అభిమానం పొందారు.మునుస్వామి అనే వ్యక్తి ఆశ్రయం ఇచ్చాడు.అక్కడ ఆళ్వారుల అధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేసారు. తల్లిదండ్రుల బలవంతంపై తిరిగి తాళ్లపాక చేరాడు.యుక్తవయస్సురాగానే తిమ్మక్క, అక్కమ్మలను వివాహం చేసుకున్నారు.భార్యలతో కలిసి రెండోసారి తిరుమల వెళ్లారు.అప్పటినుంచి రోజుకో కీర్తన శ్రీవేంకటేశ్వరునికి సమర్పించేవారు. అలా పుంఖానుపుంఖాలుగా కీర్తనలు చెప్పేవారు. శఠగోపముని శిష్యరికం అనంతరం ఆయన సకల వైష్ణవ ఆగమనాలనుఅధ్యయనంచేసారు.కులగోడలను పగులగొట్టాలనేది ఆయన అభిమతం.విజయనగరంలో దండనాధుడు సాళ్వనరసింహరాయలు అన్నమయ్య పదాలను చూసి ఆదరించారు. అనంతరకాలంలో పెనుకొండ ప్రభువు కాగానే అన్నమయ్యను ఆహ్వానించారు. ఆయన ఆస్థానంలో తగిన గౌరవం ఇచ్చారు.తనపై కీర్తనలను రాయమని అడిగాడు.'హరిని కీర్తించే నోట నరుని కీర్తించను' అని తిరస్కరించారు.దాంతో అన్నమయ్య ను ఖైదుచేసాడు పెనుకొండ ప్రభువు. ఆ తర్వాత రాజాస్థానం తనకు తగినది కాదని అక్కడ నుంచి తిరుమల చేరి జీవితశేషం వరకూ స్వామి సేవలో గడిపాడు.పంచమాగమసార్వభౌముడు, ద్రవిడాగమ సార్వభౌముడు బిరుదాంకితుడైన అన్నమయ్య జీవితవిశేషాలు ఆయన మనవడుచిన్నన్న గ్రంథం వల్ల వెల్లడైనాయి. చిన్నన్నరచించిన ద్విపద కావ్యం అన్నమాచార్య చరిత్ర 1948లో ముద్రణ కావడంతో ఆయన వివరాలు ప్రపంచానికి తెలిసింది. ఆ రచనే మూలాధారం.అన్నమయ్య కీర్తనల కంటే ముందు కృష్ణమాచార్యుల, శివకవుల కీర్తనలు ఉన్నా అన్నమాచార్య కీర్తనలతో అవి మరుగున పడిపోయాయి. ఆయన నోటి నుంచి కీర్తనలు వచ్చినవి శిష్యులు వాటిని తాళపత్రగ్రంథస్తం చేసారు.10వ శతాబ్దంలో కాశీలో తీవ్ర కరువు ఏర్పడడంతో అన్నమయ్య పూర్వీకులు దక్షిణాదిన నందవరం గ్రామానికి వలస వచ్చారు.అందుకే వారిని నందవరీకులంటారు.ఆ తర్వాత వారి వంశీయులు తాళ్లపాకలో స్థిరపడ్డారు.అన్నమయ్య తాత నారాయణయ్యకు చిన్నతనంలో చదువు అబ్బలేదు.గురువునిందించడంతో చనిపోవాలని చింతలమ్మ గుడిపక్కన ఉన్న పుట్టలో చేయి పెట్టాడు.రాత్రిపూట గ్రామదేవత చింతలమ్మ ఊరు పొలిమేరలో సంచరిస్తుందని గ్రామస్తుల నమ్మకం.ఆరోజు నారాయణయ్య పుట్టలో చేయి పెట్టడంతో చింతలమ్మ వచ్చి వారించిందని వారి వంశీకుల ఉవాచ. అప్పుడు ఆమె మీ మూడోతరంలో హరిఅంశతో కుమారుడు పుడతాడని చెప్పింది. అన్నమయ్య తండ్రి నారాయణ సూరి మహా పండితుడు.తల్లి లక్కమాంబ సంగీత విద్వాంసురాలు. వారు బిడ్డల కోసంతిరుమల వెళ్లి శ్రీనివాసుని అర్చించారు.ధ్వజస్తంభం ముందు సాష్టాంగ నమస్కారం పెడుతున్నప్పుడు స్వామివారి నుంచి దివ్యవెలుగు లక్కమాంబ కడుపులో ప్రవేశించిందని చెబుతారు. స్వామివారి ఖడ్గం నందకమే అన్నమయ్య గా జన్మిచాడని భాగవతులు చెబుతారు.ఆయన భార్య తిమ్మక్క తొలి మహిళా కవయిత్రి. సుభద్రా పరిణయం రచించారు. అన్నమయ్యకుమారుడు పెదతిరుమలాచార్యుడికి తాను దేహం చాలించిన తర్వాత ప్రతిరోజూ స్వామివారిని కీర్తించే బాధ్యత అప్పగించాడు.అన్నమయ్య సమాధి తిరుపతిలో ఉంది.కలియగ దైవం శ్రీవేంకటేశ్వరుని భక్తాగ్రేశ్వరుడు అన్నమయ్య 1503 ఫిబ్రవరి 23 (దుందుభి నామ సంవత్సర ఫాల్గుణ ద్వాదశి)న శ్రీనివాసునిలో ఐక్యమైనారు. 5 శతాబ్దాలు దాటినా ఆయన కీర్తనలు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా రసరమ్యంగా ప్రజల నాలుకలపై నాట్యం చేస్తున్నాయి. శ్రీనివాసుని వైభవం ఉన్నంతవరకూ అన్నమయ్య కీర్తనలు అజరామరం.                       

   🌹🌹🌹          
  M Vరామారావు                       సీనియర్ జర్నలిస్ట్                     +918074129668




Comments